ధనుర్వాతము-Tetanus

0

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి  ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు — ధనుర్వాతము-Tetanus-– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ధనుర్వాతము (Tetanus) ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి.ఈ వ్యాధి ‘క్లాస్ట్రీడియం టెటని’ (Claustridium tetani) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. దవడలు బిగిసే ప్రధాన లక్షణం గల వ్యాధి కనుక దీనిని ‘లాక్-జా’ (Lock-jaw) అని వ్యవహరిస్తారు. తీవ్రస్థాయిలో వ్యాధిగ్రస్తులు ధనుస్సు లేదా విల్లు లాగా వంగిపోతారు. అందువల్లనే ఈ వ్యాధికి ధనుర్వాతము అనే పేరు వచ్చింది.

వ్యాధికారక సూక్ష్మక్రిములు గడ్డిమేసే జంతువుల పేడ ద్వారా వెలువడి, వీటి స్పోర్లు మట్టిలోను, దుమ్ములోను చాలా కాలం బ్రతికి ఉంటాయి. చర్మం పగుళ్ళు, గాయాలు, జంతువుల కాట్లద్వారా మన శరీరంలో ప్రవేశిస్తాయి. బొడ్డును కోసే పరికరాలు, కట్టే దారం అపరిశుభ్రమైనవైతే, కోసిన బొడ్డుకు బూడిద, పేడ పూయడం ద్వార పురిటి బిడ్డలలో దనుర్వాతం కలుగుతుంది.

సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశించిన చోటనే, ఆమ్లజని రహిత పరిస్థితులలో వృద్ధిచెంది ఎక్సోటాక్సిన్ (Exotoxin) ను ఉత్పత్తి చేసి అవి రక్తంద్వారా నాడీ మండలాన్ని చేరి వ్యాధి లక్షణాలను కలుగజేస్తాయి. మొదటి సాదారణ లక్షణాలు దవడలు బిగిసి, నోరు సరిగా తెరవ లేకపోవడం, మెడ బిగియడం, శరీరం వంకరలు పోవడం. చంటిపిల్లలు పాలు త్రాగరు. కొద్దిపాటి వెలుతురు, శబ్దం లేక రోగిని ముట్టుకున్నా శరీరం వంకరలు తిరిగిపోరుంది. ఛాతీ కండరాలు దెబ్బతిని మరణం సంభవించవచ్చును. ఈ వ్యాధి అంతర్గతకాలం (Incubation period) సాధారణంగా 3 నుండి 21 రోజులు.

చికిత్స:

    గాయాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రపరచాలి.
    రోగిని వెలుతురు, శబ్దం లేని గదిలో ఉంచాలి. అనవసంగా ముట్టుకోవద్దు.
    వైద్యసలహాతో Anti-Tetanus Serum (ATS) వాడాలి.
    గొట్టం ద్వారా ఆహారం మరియు శ్వాస అవసరం.

ముందు జాగ్రత్త చర్యలు:

గర్భవతులకు టి.టి. మరియు పిల్లలకు డి.పి.టి, డి.టి., టి.టి. టీకాలు షెడ్యూలు ప్రకారం ఇప్పించాలి.

ధనుర్వాతంతో జాగ్రత్త!
వానకాలం మొదలయ్యిందంటే పెరట్లో పాదులు తీయటం, మొక్కలు నాటటం వంటివి మామూలే. చాలామంది కాళ్లకు చెప్పులు వేసుకోకుండానే మట్టిలోకి దిగి ఇలాంటి పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి పనులకు దిగేముందు ధనుర్వాతం.. అదే టెటనస్‌ (టీటీ) టీకా ఎప్పుడు వేయించుకున్నారో కూడా గుర్తుకుతెచ్చుకోండి. ఎందుకంటే చేతులకు, కాళ్లకు ఏవైనా గీరుకుపోవటం, చిన్నపాటి గాయాలు సైతం ధనుర్వాతానికి దారితీయొచ్చు. చాలామంది తుప్పుపట్టిన మేకులు గుచ్చుకోవటం, పెద్దపెద్ద గాయాలతోనే ధనుర్వాతం వస్తుందని అనుకుంటుంటారు. నిజానికి ధనుర్వాతాన్ని తెచ్చిపెట్టే బ్యాక్టీరియా సిద్ధబీజాలు మట్టి, దుమ్ము, జంతువుల వ్యర్థాలు.. ఇలా వేటిలోనైనా, ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి సాధారణంగా చర్మం మీద గాటు పడినచోటు నుంచి రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం వృద్ధి చెందుతూ కొన్ని విషతుల్యాలను విడుదల చేస్తాయి. ఈ విషతుల్యాలు ముందుగా గాయానికి చుట్టుపక్కల చర్మంలోని నాడులను దెబ్బతీస్తాయి. క్రమంగా విస్తరిస్తూ వెన్నుపాముకు, మెదడుకు వ్యాపిస్తాయి. ఇలా చూస్తుండగా కొన్నిరోజుల్లోనే ధనుర్వాతం తీవ్రమవుతూ వస్తుంది. మెడ బిగుసుకుపోవటం, మింగటంలో ఇబ్బంది, కడుపు బల్లలాగా గట్టిపడటం వంటి లక్షణాలు మొదలవుతాయి. విషతుల్యాలు విస్తరిస్తున్నకొద్దీ కండరాలు గట్టిగా కుంచించుకుపోవటం.. చివరికి దవడ పూర్తిగా బిగుసుకుపోవటం సంభవిస్తుంది. ఒకసారి ధనుర్వాతం ఆరంభమైతే ఇక ఆగటమనేది ఉండదు. ధనుర్వాతాన్ని నియంత్రించటం తప్ప పూర్తిగా నయం చేయలేం. అయితే మంచి విషయం ఏంటంటే.. దీన్ని టీకాతో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతి పదేళ్లకు ఒకసారి టీకా తీసుకుంటే ధనుర్వాతం బారినపడకుండా చూసుకోవచ్చు. పెద్ద గాయాలే కాదు. కీటకాలు, జంతువులు కరవటం.. చర్మం గీసుకుపోవటం ద్వారా కూడా ధనుర్వాతం వచ్చే అవకాశముంది. కాబట్టి ముందే టీటీ టీకా తీసుకోవటం మంచిది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.