Sri Gajanan Thaman Garu

0

గజానన్ తామన్ సొంతూరు ఆదిలాబాద్ జిలాల్లోని చాకేపల్లి. మక్తేదారుల కుటుంబం. భూస్వాముల కుటుంబంలో పుట్టినా ఫ్యూడల్ సంస్కృతిలేని ఇంట పెరిగారు. గజానన్ తాతగారు రాజారామ్ తామన్ సంస్కృత, ఆంగ్ల, మరాఠీ భాషల్లో మంచి పండితుడు. నానమ్మ ఆయుర్వేద వైద్యం చేసేది. మనవడిది తాతగారి పోలికే. గజానన్ తండ్రి అంతగా చదువుకోలేదు. కాని కొడుకును మాత్రం బాగా చదివించాలని ఆరాటపడేవాడు. చాకేపల్లిలో స్కూల్ లేకపోవడంతో గజానన్ అమ్మమ్మ ఊరైన మంథనికి పంపించాడు కొడుకును.

తెలుగుతో స్నేహం

మంథనిలో ఉర్దూ మీడియం చదువు గజానన్‌ను తెలుగు అక్షరాలకు అపరిచితుడిగా మిగిల్చింది. అక్కడ భమిడిపాటి వీర సూర్యనారాయణ పరిచయం గజానన్‌ను పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ చురుకుగా, హుషారుగా ఉండే గజానన్ అంటే ఆయన బాగా ఇష్టపడేవాడు. వాళ్లింటికి తీసుకెళ్లి వాళ్లమ్మాయితో..‘వీడికి తెలుగు ఒక్క అక్షరం కూడా రాదు, కొంచెం నేర్పు’ అనేవాడట. గజానన్‌కు తెలుగు ఆధునిక సాహిత్యాన్ని పరిచయం చేసింది ఆయనే. పుస్తకాలు చదవడంలో ఉన్న రుచి తెలిసి ఆ స్నేహానికి బానిసయ్యాడు గజానన్. ఆ ప్రేరణతో తన స్కూల్ మ్యాగజైన్‌కు కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. దానికి ఎడిటర్ అతనే. అట్లా మెట్రిక్ పూర్తిచేశాడు. కొడుకును ఇంజనీర్‌ను చెయ్యాలని గజానన్ తండ్రి గుణవంతురావు కల. కాని లెక్కల్లో మార్కులు తక్కువరావడంతో ఇంజనీరింగ్ కల కల్ల అయింది. గుమాస్తా గిరి చేయమని ఆర్డరేశాడు తండ్రి కొంచెం అసహనంగానే. గజానన్‌కేమో పై చదువులకెళ్లాలని. చేసేదిలేక టీచర్ ఉద్యోగంలో చేరాడు.

మహారాష్ట్ర ప్రయాణం

సుల్తానాబాద్‌లో టీచర్‌గా ఉన్నప్పుడు రవీంవూదనాథ్ ఠాగూర్ పోస్టాఫీస్‌ను తెలుగులోకి అనువదించి స్కూల్ పిల్లలతో నాటకం కూడా వేయించాడు. దాంతో గజానన్ సాహిత్య పిపాసిగా అందరి దృష్టికి వచ్చాడు. ఉద్యోగం, పుస్తకాలతో కాలం గడుస్తున్నా పై చదువులు చదవాలన్న కోరిక మాత్రం రొద పెడ్తూనే ఉంది గజానన్‌లో. సన్నిహితుడైన రాఘవాచార్యులుకు గజానన్ మనసు తెలిసింది. తృష్ణ ఉన్నప్పుడు జాగెందుకు పై చదువులకని ప్రోత్సహించాడు. ఈలోపే తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు చురుకుగా. ఫజల్ అలీ కమీషన్ రిపోర్టులో తేల్చినట్టు తెలంగాణ ఏర్పాటుకు పాటుపడిన కేశవడ్డి ప్రభృతుల్లో గజానన్ కూడా ఉన్నాడు. తెలంగాణ రాలేదన్న నిస్పృహతో మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే పీపుల్స్ కాలేజ్ నుంచి బిఏ పట్టాపొంది తర్వాత మరఠ్వాడా యూనివర్శిటీ ఔరంగాబాద్ నుంచి ఇంగ్లీష్‌లో ఎమ్మే చేశారు. తాను చదివిన కాలేజ్‌లోనే రీడర్‌గా కొంతకాలం పనిచేసి ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమితులయ్యారు.

భారతిలో కవిత

మహారాష్ట్ర గజానన్‌లోని సాహితీ దాహాన్ని తీర్చే చెలిమెగా మారింది. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ సాహిత్యంతో విడిపోని బంధం ఏర్పడింది. ఈ ముగ్గురు స్నేహితులతోనే ఆయన జీవితం పెనవేసుకుపోయింది. మరాఠీలో చదువుతూ తెలుగులో ఆలోచించేవాడు. ఎమ్జన్సీ సమయంలో ఆ పరిస్థితుల మీద రాసిన కవిత ‘భారతి’ మ్యాగజైన్‌లో అచ్చయింది. మహాకవి శ్రీశ్రీ కవితలనే మూడు సార్లు తిప్పి పంపింది ఆ మ్యాగజైన్. కానీ గజానన్ నాలుగు కవితలను అచ్చేసింది ‘భారతి’.మరాఠీలోని గ్రేస్ అనే కవినుంచి స్ఫూర్తిపొందిన గజానన్ తామన్ ఉద్యోగ విరమణ పొందాక మంథనికి వచ్చి స్థిరపడ్డారు.

నరసింహారావు మాట

1997 నుంచి 2009 వరకు రాసిన తన కవితలన్నిటిని పోగుచేసి ‘మానస సరోవరంగా’ మలిచారు. దానికి సాహిత్యవూబహ్మ డా.వి.వి.యల్.నరసింహారావు ‘హంసధ్వని’ పేరిట ముందుమాట రాశారు. అందులో ‘ ఈ హంసకు బహుభాషలు వచ్చు. మానస సరోవరంలో ఈదుకుంటూనే అలవోకగా వేదోపనిషత్తుల్నీ, వాల్మీకివ్యాసుల రామాయణ భారతాల్ని, ఇంగ్లీషులో టెన్నిసన్, షెల్లీ, బ్రౌనింగ్ ప్యాస్టర్‌నాక్, తెలుగులో శ్రీశ్రీ, దేవులపల్లి, కరుణశ్రీ, తిలక్, దాశరథి, సినారె మొదలైన మహాకవుల రచనలనూ మధురంగా గానం చేస్తుంది’ అని గజానన్‌ను కొనియాడాడు నరసింహారావు. మరాఠీ కవి గజానన్ దిగంబర్ మాడ్గూళ్కర్ రాసిన ‘గీత్ రామాయణ్’ను తెలుగులో ‘సాకేత రామాయణం’గా అనుసృజించాడు గజానన్. అంతేకాదు అంపశయ్య నవీన్ కాలరేఖలకు పరిచయవాక్యాలు రాశారు. గట్టు నారాయణ ‘నోబుల్ లీడర్’ను ‘ఉదాత్త నేత’గా ‘ఆఫరింగ్స్ వన్ అండ్ టూ’ను ‘కథాంజలి వన్ అండ్‌టూ’గా తెలుగులో అనువదించాడు గజానన్. రుగ్వేదాన్ని అభ్యసించిన ఆయన ‘సాహిత్య వరివస్యలో మంథని’ అనే కృతికీ పురుడుపోశాడు. పురుషోత్తమ్ గేరే మరాఠీ నవల సావివూతికి ఈయన తెలుగులో చేసిన అనువాదం మాత్రం ఇంకా అమువూదితంగానే ఉంది.

ఈట్స్‌కు దగ్గర

జీవితంలోని చేదు, తీపిలను సమపాళ్లలో చవిచూసిన ఏడుపదుల ఈ అక్షరపిపాసి జీవనవాదాన్ని, మార్క్స్‌వాద దృక్పథాన్ని ఏమాత్రం వదులుకొనలేదు. ఇంగ్లీష్ కవి ఈట్స్‌కు, గజానన్‌కు చాలా సామ్యం ఉంది. ఐర్లండులో ఉంటున్నా స్వస్థలమైన మడగాన్ కోసం పరితపిస్తుంటాడు ఈట్స్. గజానన్ కూడా అంతే. మహారాష్ట్రలో ఉంటున్నా తెలంగాణ ఊపిరిగానే బతికాడు. ఆయన కవితల్లో ఇది ప్రస్ఫుటమవుతుంది. స్త్రీవాదం, పర్యావరణం కూడా ఈయన కవితకు మూలాంశాలు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.