సమ్మక్క సారలమ్మ జాతర

0

వన జాతర – జన జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
ఈ నెల 17 నుండి 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా తొలి జాతర

పవిత్ర మేడారం ప్రపంచ చరివూతలో ఓ ‘మహా జాతర’గా గుర్తింపు పొందింది. ఉత్తర భారతదేశంలోని కాశీలో ప్రతీ పన్నెండేళ్ళకోసారి జరిగే పుష్కర మేళాలో లక్షలమంది భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ కోవలోనిదే సమ్మక్క సారలమ్మల జాతర!
వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం ‘మేడారం’ గ్రామంలో ప్రతి రెండేళ్ళ కొకసారి మాఘశుద్ధ పౌర్ణమిన 4 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నాన మాచరించి వనదేవతలను దర్శించుకుంటారు. ఈ గిరిజన వనజాతర కాశీ పుష్కర మేళాలకు, పూరీ జగన్నాథ రథయావూతకు, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు భిన్నమైన రీతిలో ఆదివాసీ సంప్రదాయాలతో కొనసాగుతుంది. ఇది మరో ‘గిరిజన కాశీ’గా విరాజిల్లుతోంది.

కోయ సాంస్కృతిక జాతర:
ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీలలో జరగబోయే మేడారం వనజాతర చుట్టూరా 1500 ఎకరాల సువిశాల అటవీ ప్రదేశమంతా విస్తరిస్తుంది. లక్షల మంది భక్తుల కానుకలతో ఆదాయ వనరుగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ఈ జాతరపై పడింది. ప్రస్తుతం రూ. వందల కోట్ల నిధులు వెచ్చించి జాతర ప్రాంగణంలో, భక్తులకు సౌకర్యాలను తీర్చిదిద్దుతోంది.

మేడారంలో వెలసిన అద్భుత మహిమ గల దేవతలు సమ్మక్క, సారలమ్మలు విగ్రహాల రూపంలో ఉండరు. గుడి గోపురాలు లేవు. పూజా పురస్కారాలు ఉండవు. స్థిరమైన దేవతల ప్రతిమలు లేవు. ఇవి వెదురు దుంగలతో సాక్షాత్కరించే వన ప్రతిమలు. సాంప్రదాయ కోయ గిరిజన పూజలతో జాతర జరుగుతుంది. పసుపు, కుంకుమ, బెల్లం (బంగారం), కొబ్బరికాయలు, అడవిపూలతో పవివూతంగా కోయతెగ వడ్డెలు దేవతలనే ప్రకృతి దేవతలుగా పూజిస్తారు. ఆదివాసీ కోయ సంస్కృతిలో గుడి మెలిగే పద్ధతి నుంచి సాంప్రదాయ వాయిద్యాల నడుమ గద్దెలపై వనదేవతలను ప్రతిష్టించిన అనంతరం భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. మేడారంలో వెలసిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, నాగులమ్మలు కోయ గిరిజనుల ఇలవేల్పులు. వీరు కాకతీయ రాజుల పాలనను ధిక్కరించి పోరాడిన తీరు, వనదేవతలుగా అవతరించడం వెనుక ఆధారాలు స్పష్టంగా లేకపోయినా మేడారంలో ప్రధాన గద్దెలు, చిలుకల గుట్ట, జంపన్న వాగు, శివసత్తులు, రామప్ప దేవాలయ గోపురంపై కోయ వనితల శిల్పాలు సజీవంగా దర్శనమిస్తాయి. స్థానిక కోయ గిరిజనులు చెప్పే మౌఖిక సాహిత్యం, సంస్కృతీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు జాతరలో కొనసాగుతున్నాయి.

మొదట కోయ గిరిజనులైన చందా వంశీయుల ద్వారా 1940-50ల మధ్య బయ్యక్క పేటలో ఆరంభమైన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రస్తుతం మేడారంలోని జంపన్నవాగు సమీపంలో జరుగుతోంది. ఇప్పుడు ఈ జాతర వివిధ తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ వనదేవతలను మొదట తెలంగాణ ప్రాంత కోయ గిరజనులు మాత్రమే కొలిచేవారు. నేడు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలవారు కూడా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర నుండి గోండులు, మధ్యవూపదేశ్ నుండి కోయలు, బీర్స్, రఫిస్తార్ గోండులు ఒడిషా నుండి సవర గిరిజనులు, ఆంధ్రవూపదేశ్ నుండి అన్ని ఆదివాసీ తెగల గిరిజనులు జాతరకు వస్తున్నారు. ఇంకా చత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన గిరిజనుల్లో వివిధ సంస్కృతీ, ఆచారాలు, భాష ఉన్నప్పటికీ ఆరాధించే పద్ధతి మాత్రం ఏకరీతిలో ఉండటం విశేషం. వనదేవతల పూజారులు (వడ్డెలు) గోత్రాల వారీగా మొత్తం 14 మంది వారసత్వంగా జాతర నిర్వహిస్తున్నారు. నేడు కులమతాల కతీతంగా దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆదివాసీ సంప్రదాయాల నడుమ వనదేవతల దీవెనలు పొందుతున్నారు.

జాతర సంస్కృతి – ఆరాధన
ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 20 వరకు జాతరను నిర్వహిస్తూన్నారు. రెండేళ్ళ కొకసారి ఈ జాతర వస్తుందంటే, జాతరకు వెళ్ళేవారు ముందుగా తమ తమ ఇళ్ళల్లో సమ్మక్క పండుగ చేసుకున్నాకే, కుటుంబ సమేతంగా మేడారం వెళ్తారు. తమ ఇళ్ళను శుభ్రంగా అలుక్కుని, నిలు బంగారం (బెల్లం) కొనుగోలు చేసి కొబ్బరికాయ కొట్టి, అమ్మవార్లకు చీర, రవికె పెడతారు. పూజ రోజు కోడి లేదా యాట కోసి విందు చేస్తారు. మరి కొందరు మొక్కులున్న వారు మొదట వేములవాడ దర్శించి తర్వాత మేడారం జాతరకు వస్తారు.

గిరిజనులు పండించుకునే ‘పసుపు’ను దేవతలకు ‘బండారు’ పేరిట అర్పించడం, తమకు నిత్యం ఉపయోగపడే ‘వెదురు’ను పూజించడం, కొబ్బరికాయలు, నిలు బంగారం (బెల్లం)తో మొక్కులు తీర్చుకోవడం, వనదేవతలకు చీర, రవికెలు సమర్పించడం, ఇప్పసారా ఆరబోయడం వంటివి గిరిజనుల పూజా విధానం. జాతర ప్రారంభానికి ముందు ఆదివాసీలు పసుపుతో సమ్మక్క, సారలమ్మల గద్దెలను పూసి, వాటిని అడవిపూలతో అలంకరిస్తారు. దీనిని ‘మండ మెలగడం’ అంటారు. కులపెద్దలు, పూజారులైన వడ్డెలు వెళ్లి అమ్మవారిని ఘనంగా కొలుస్తారు. అమ్మవారికి యాటను బలి ఇస్తారు. ఒక కోడిని కోసి మేడారం గ్రామం పొలిమేరలో కడతారు.

సంస్కృతి పరంగా గిరిజన తెగలలో సప్త గోత్రాలు (గొట్టులు) ఉన్నాయి. ఒకటవ, రెండవ గోత్రాల వారు కేవలం మహారాష్ట్ర, మధ్యవూపదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రవూపదేశ్‌లో ఉండేవారు 3వ గోత్రం కాకేటి, 4వ గోత్రం సనపగాని, 5వగోత్రం -బండాణి, 6వ గోత్రం-బెరంబోయిన, 7వ గోత్రం -పరదాని. ఈ గోత్రాలను బట్టి గిరిజన తెగల మధ్య సంబంధ బాంధవ్యాలు, పెళ్లిళ్ళు, ఆచార సాంప్రదాయాలు, పండుగలు ఉంటాయి. ఈ వనదేవతలకు వివిధ గోత్రాలకు చెందిన గిరిజనులు పూజలు నిర్వహిస్తారు. వీరిని ‘వడ్డెలు’గా పిలుస్తారు. సమ్మక్క పూజారులు-5 గురు, సారలమ్మ పూజారులు-7 గురు, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది ఉన్నారు. తెల్లబట్టలు, ఎర్రని కండువా ధరించిన పూజారులు- వారి పూజావిధానం గోత్రాల పరంగా వారసత్వంగా వస్తుంది. సమ్మక్కను మొదట చందా వంశీయులు ఆడబిడ్డగా కొలిచారు. తర్వాత సిద్ధబోయిన వారు, ఐదవ గోత్రం వారు పూజిస్తారు. సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులను నాలుగో గోత్రం వారు పూజిస్తారు.

పూజారులు కన్నెపల్లిలోని గద్దెలను అలికి, ముగ్గులు వేసి అలంకరిస్తారు. సారలమ్మను వెదురుబుట్టలో ఉంచి పైన పడగపెట్టి , అధికార లాంఛనాలతో మేళతాళాలు, గిరిజన నృత్యాల నడుమ మేడారానికి తీసుకువస్తారు. అదే రోజు రాత్రి గోవింద రాజును ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి మేడారానికి చేర్చుతారు. అలాగే, సమ్మక్క భర్త పగిడిద్ద రాజును పెనుక ‘పూజారి’ కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుండి తీసుకువస్తారు. పడిగాపురం ప్రాంతంలోని వనం గుట్ట నుండి అనుము చెట్టుకు పూజలు నిర్వహించి వెదురును గద్దెకు తీసుకువస్తారు. అప్పుడు వెదురు బెరడు కోసం భక్తులు ఆరాట పడుతుంటారు.

రెండో రోజు గురువారం ఉదయం సమ్మక్క పూజారులు బయ్యక్కపేటలో సమ్మక్క గద్దె దగ్గర పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలుకలగుట్ట నుండి సమ్మక్కను అధికార లాంఛనాలతో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తారు. సమ్మక్క దేవతను బయటకు తీసేముందు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరుపుతారు. మూడోసారి కాల్చిన శబ్దంతో మండ దగ్గర ( గుట్ట దిగేదారి) లో చెలపెయ్య (ఆవు) ను బలి ఇస్తారు. (ఇది రహస్యంగా భక్తులు చూడకుండా జరుగుతుంది). తర్వాత పూజారులు నెమలి నార చెట్టువద్ద పూజలు చేసి సమ్మక్కను ప్రధాన గద్దెపైకి తీసుకువస్తారు. సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో లక్షలాది మంది భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. శివసత్తులు పూనకాలు చేస్తారు. దేవతకు ఎదురేగాలని ఎగిగిరి చేతులతో నమస్కరిస్తారు. భక్తులు ఎదురు కోళ్లను ఇస్తారు. మరి కొందరు గద్దెకు వచ్చే దారిలో అడ్డంగా పడుకుంటే వారి పై నుండి పూజారులు నడుచుకుంటూ దేవతను తీసుకువస్తారు. తమపై నుండి దేవతలు వెళ్తే జన్మ సార్థకమైనట్లు భక్తులు భావిస్తారు. మూడోరోజు శుక్రవారం పౌర్ణమిన నిండు జాతర. భక్త జనకోటి దేవతలను క్యూలైన్లలో వెళ్లి దర్శించుకుంటారు. సమ్మక్క తల్లికి నిలు బంగారం (బెల్లం), కానుకలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. నాలుగో రోజు శనివారం దేవతల వనవూపవేశంతో జాతర ముగుస్తుంది.

పూర్వం నుంచి 1944 వరకు ఆదివాసీ గిరిజనులకే పరిమితమైన వన జాతర నేడు కోట్లాది మంది భక్తుల జనజాతర, సకల జనుల జాతరగా మారింది. 1962 వరకు రెవెన్యూ శాఖ, 1968 నుంచి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ జాతరను నిర్వహిస్తుండగా 1996లో ‘రాష్ట్ర పండుగ’గా గుర్తింపు పొంది, ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచడంతో ‘జాతీయ పండుగ’ కావడానికి ఎదురుచూస్తోంది.

పోరాట చరిత్ర:
అతి పురాతనమైన ఆదివాసీల పోరాటాలు భూమికోసం, భుక్తికోసం, ముక్తికోసం జరిగాయి. సుమారు 800 సంవత్సరాలకు పూర్వం కాకతీయుల పాలనలో, కీకారణ్యంలో ఆదివాసీ బిడ్డలు పరాధీనత నుంచి స్వేచ్ఛాయుత (స్వయం) పాలన కోసం ఆదిమ కోయజాతి వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కాకతీయుల సైన్యంతో పోరాడి ఆత్మత్యాగాలు చేశారు.

క్రీ.శ.1260-1326 కాలంలో ఓరుగల్లు రాజధానిగా పాలించిన కాకతీయుల సామ్రాజ్యంలో కోయరాజ్యం ఉన్నట్లు సమ్మక్క, సారలమ్మల చారివూతిక నేపథ్యం వల్ల తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని విస్తారమైన అటవీ ప్రాంతాన్ని (మహదేవ్‌పూర్) కలిపి ఆనాడు మేడరాజు కోయరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మేడరాజు అద్భుత మహిమా శక్తిగల సమ్మక్కను గుర్తించి తన మేనల్లుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి పెళ్ళి జరిపించాడు. మేడరాజు అనంతరం పగిడిద్ద రాజు మేడారంను కేంద్రంగా చేసుకొని కోయలను పరిపాలించాడు. సమ్మక్క, పడిగిద్ద రాజుల సంతానం కొడుకు జంపన్న, కుమ్తాలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు. కోయరాజులు కాకతీయుల సామంతులు. ఏటా పంటల ఆదాయంపై వారికి కప్పం కట్టాలి. అయితే, అప్పటికి నాలుగేళ్ళు వరుసగా కరువు, కాటకాలు దాపురించటంతో ఇక కప్పం చెల్లించలేమని రాజుకు వర్తమానం పంపాడు.

దీంతో కాకతీయులు కోయరాజులను, ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారు. బానిసలుగా బతకలేమని కోయరాజులు ధిక్కరించడంతో కాకతీయ ప్రభువు ప్రతాపరువూదుడు సైన్యంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కోయదొరలూ వెనుకడుగు వేయలేదు. మేడారం వద్ద వున్న సంపెంగ వాగు దాటకుండానే కాకతీయ సైన్యాన్ని తరిమివేయాలని యుద్ధంలో పోరాడిన పగిడిద్ద రాజు కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజు సంపెంగ వాగులోనే వీర మరణం పొందారు. ఆ వాగునే ‘జంపన్న వాగు’గా పిలుస్తున్నారు. తర్వాత పగిడిద్దరాజు, సారక్క, నాగులమ్మ యుద్ధంలో పోరాడి అసువులు బాసారు. దీంతో సమ్మక్క తన ప్రత్యేక సైన్యంతో భీకర పోరాటం జరిపి కాకతీయ సైన్యాన్ని గడగడ లాడించింది. కానీ, రహస్యంగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచారు. రక్తం కారుతున్న గాయంతో ఆమె మేడారానికి ఈశాన్య దిక్కున గల చిలుకల గుట్టవైపు వెళ్ళి అదృశ్యమైంది. చిలుకల గుట్టపైన ఒక నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణె రూపంలో ప్రత్యక్షమై దేవతగా సమ్మక్క అవతరించిందని కోయల ప్రగాఢ నమ్మకం.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.