పెంజేరుకట్ట గజానన మండలికి 100 ఏళ్లు

0

గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు, అన్నదానాలు, భజనలు, హోరెత్తించే నిమజ్జన దృశ్యాలు అనే మనకు తెలుసు! కానీ ఆ ఉత్సవాలతో జాతిని జాగృతం చేయవచ్చని స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రజలో చైతన్యం నింపేందుకు ఆయుధంగా మలచవచ్చని తిలక్‌ నిరూపించాడు. తిలక్‌ అడుగుజాడల్లోనే కరీంనగర్‌ జిల్లా మంథనిలోని సర్వగజానన మండలి పయనించింది. ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి కృషి చేసింది. 1916లో ఏర్పాటు చేసిన సర్వజన గజానన మండలి వారు గణపతి ఉత్సవాల పేరిట కొందరు స్వాతంత్య్ర సమరయోధులు ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి రహస్యంగా తీసుకు వచ్చిన మట్టి గణపతి విగ్రహానికి నవరాత్రి ఉత్సవాల పేరిట ప్రజలను పోగు చేసి ఇటు స్వాతంత్య్ర, ఆటు హైందవ సంస్కృతి పరిరక్షణను ప్రజల్లో నూరిపోశారు. అటువంటి ఘన చరిత్రకలిగిన మంథని పెంజేరుకట్ట సర్వజన గజానన మండలికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంతటి చారిత్రక నేపథ్యం గల గణేశ్‌ ఉత్సవాలతో ప్రజా చైతన్యం వెల్లి విరిసిందనడానికి.. గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి నిజాం ప్రభువు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించడమే తార్కాణం.
పోలీసుల కళ్లుగప్పి.. విగ్రహం తీసుకువచ్చి
దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేందుకు ముంబైలో బాలగంగాధర్‌ తిలక్‌ ప్రారంభించిన గణేష్‌ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని కొందరుస్వాతంత్య్ర సమరయోధులు 1916లో మంథనిలో సర్వజన గజానన మండలిని ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల, తెలంగాణలో నిజాం నవాబ్‌ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు, హైందవ జాతిని ఏకీకృతం చేసేందుకు నాటి మంథని స్వాతంత్య్ర సమరయోధులు కృషి చేశారు. మంథనికి చెందిన సువర్ణ రఘురామయ్య, మార్పాక శేషయ్య మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వంటలు చేయడం కోసం వలస వెళ్లేవారు. నాగ్‌పూర్‌లో ఇంగ్లీష్‌ వారు, తెలంగాణలో నిజాం ప్రభువులు వారి పండుగలు ఘనంగా జరుపుకొంటూ హిందువుల పట్ల చిన్న చూపు చూడటాన్ని జీర్ణించుకోలేక.. తాము కూడా తమ పండుగలను ఘనంగా జరుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ముంబైలోని గణేష్‌ ఉత్సవాలను ఆదర్శంగా తీసుకొని మంథనిలో గజానన మండలిని ఏర్పాటు చేశారు. రఘురామయ్య, శేషయ్య నాగ్‌పూర్‌లో జరిగే గణేష్‌ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులుగా కూడా పని చేశారు. అదే స్ఫూర్తితో నాగ్‌పూర్‌లో గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసుకొని రైలులో బలార్ష వరకు వచ్చి అక్కడ విగ్రహాన్ని దుస్తులతో చుట్టబెట్టి అక్కడ నుంచి ఎడ్లబండిలో మంథని గోదావరి నది తీరం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కాలి బాటన నిజాం పోలీసుల కంట పడకుండా మంథనికి చేరుకున్నారు. తొలుత విగ్రహాన్ని వాగుగడ్డ ప్రాంతంలోని సువర్ణ రఘురామయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించేవారు. ఆ తర్వాత పెంజేరు కట్టలోని హనుమాన్‌ దేవాలయ ప్రాంగణంలోకి వేదికను మార్చారు. అలా చాలా సంవత్సరాలు అక్కడ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. నిజాం ప్రభుత్వం తొలిసారిగా గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి 15 రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించేలా చేసిన ఘనత మంథనికే దక్కింది.
నాగ్‌పూర్‌ తర్వాత మంథనే
నిజాంరాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యేవరకు..ఎన్నికష్టాలు వచ్చినా సువర్ణ రఘురామయ్య, శేషయ్య, మంథని లింగన్న, లోకే పెద్దరామన్నలు గణేష్‌ ఉత్సవాల ను నిర్వహిస్తూ వచ్చారు. తొలి గణేష్‌ విగ్రహాన్ని మొదటిసారిగా నాగ్‌పూర్‌ నుంచి తీసుకురాగా ఆ తర్వాత స్థానిక సాలె కిష్టయ్యతో మట్టితో విగ్రహాన్ని తయారు చేయించేవారు. సర్వగజానన మండలి ఆధ్వర్యంలో జరిగేగణేష్‌ నవరాత్రులుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలో తొలుత ఏర్పాటు చేసిన నాగ్‌పూర్‌, మంథనిలో తప్ప మరెక్కడ గణపతి పక్కన సిద్ధి, బుద్ధి (భార్యలు)ల విగ్రహాలు ఉంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరగదు. 1916లో మొదలైన పెంజేరుకట్ట గణేశ నవరాత్రి ఉత్సవాలు నేటికీ నిరాటంకంగా జరుగుతుండడం విశేషం

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.