మల్హర్‌రావు చరిత్ర

0

దొరల పెత్తనం..గ్రామీణ ప్రాంతాల వెనుకబాటును సహించక పేదల కోసం తపించిన వ్యక్తి ఆయన. జమీందారి కుటుంబం నుండి వచ్చినా పేదల జీవనవిధానం కలచివేసింది ఆయన్ను. ఉన్నత ఉద్యోగం వదిలి తన ప్రాంత ప్రజల, గ్రామాభివృద్ధి కోసం నడుంబిగించాడు. అనాథికాలంలోనే రాజకీయా ల్లో ఎదిగి విద్యుత్‌ సౌకర్యాలు లేని గ్రామాల్లో వెలుగులు నింపి ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఆప్తుడయ్యాడు. సేవలను గుర్తించి అప్పటి ప్రభుత్వం ఆయన పేరునే మండలం పేరుగా మార్చింది. ఆయనే మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మల్హర్‌రావు. నేడు ఆయన 66వ జయంతి. మల్హర్‌రావు చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. ఏడవ తరగతి వరకు మల్లారంలో, 10తరగతి వరకు మంథనిలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్‌ నుండి పీజీ వరకు హైద్రాబాద్‌లో కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్‌ పూర్తి చేసిన మల్హర్‌రావు కళాశాల లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యొగం పొందాడు. గ్రామాల్లో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయేవాడు. వాటిని తీర్చాలంటే రాజకీయాల్లోకి రావడమే ఉత్తమం అని అనుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతో ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
సర్పంచ్‌గా ప్రస్థానం..
1983లో మల్లారం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ప్రాంత రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యంలేక పడుతున్న ఇబ్బందుల కు గమనించి అప్పటి ఎమ్మెల్సీ గీట్ల జనార్ధన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగి మరీ మంథనికి మార్కెట్‌ కమిటీని సాధించారు. మల్హర్‌ రావు పట్టుదల చూసిన జనార్థన్‌రెడ్డి ఆయన్నే మొట్టమొదటి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమిం చాడు. అప్పట్లో తాడిచర్లతో పాటు అనేక గ్రామాలు అటు మహదేవపూర్‌ ఇటు మంథని తాలుకాలో ఉండేవి. వీటన్నింటిని కలిపి తాడిచర్ల మండలంగా ఏర్పాటుచేయాలని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపట్టారు. దీంతో తాడిచర్ల మండలం ఏర్పాటయింది. 1987లో తాడిచర్ల మండలం మొట్టమొదటి మండలాధ్యక్షుడిగా మల్హర్‌రావు ఎన్నికయ్యారు. ఎంపీపీగా రెండున్నర సంవత్సరాల పదవీకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను తనదైన శైలిలో చేసి చూపించారు. సమాచార వ్యవస్థ అంతగా అభివృద్ది చెందని కాలంలో ఏదయినా పనికోసం మండల, జిల్లా స్థాయి కార్యలయాలకు కాకుండా నేరుగా హైద్రాబాద్‌కు వెళ్లేవారు. తనకు పరిచయం ఉన్న ఐఎఎస్‌ మిత్రుల ద్వారా పనులకు చక్కబెట్టేవారు.
పీపుల్స్‌వార్‌ చేతిలో హతం..
అనతికాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మల్హర్‌రావును అప్పటి పీపుల్స్‌వార్‌ కిడ్నాప్‌ చేసింది. నాలుగు రోజుల అనంతరం 05-06-1989న మంథని మండలం ధర్మారం గ్రామ సమీపంలో కాల్చి చంపారు. మారుమూల ప్రాంతం నుండి ఎంతో ముఖ్యనాయకుడిని కోల్పోయామని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్వయంగా ప్రకటించారు. పీపుల్స్‌వార్‌ చరిత్రలోనే దేశంలో ఓ ప్రజాప్రతినిధిని కాల్చిచంపడం మల్హర్‌రావు మరణంతోనే ప్రారంభమ యింది. అయితే మల్హర్‌రావును చంపండం తమ చారిత్రక తప్పిదమని కొద్ది రోజుల అనంతరం పీపుల్స్‌వార్‌ ప్రకటించింది. ఆయన మరణానికి గుర్తుగానే తాడిచర్ల మండలానికి మల్హర్‌ మండలంగా నామకరణం చేశారు. నేడు మల్హర్‌రావు66వ జయంతి సందర్భంగా ఆయన సేవలకు గుర్తుగా కొయ్యూరు లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మల్హర్‌రావు బామమరిది గోనె శ్రీనివాస్‌రావు జెడ్పీటీసీగా, ఆయన భార్య గోనె పద్మ మల్లారం సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.