కోజాగిరి వ్రతం

0

సిరి సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రతిఒక్కరు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తారు. అటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వ్రతం కూడా ఒకటుంది. అదే ‘కోజాగిరి వ్రతం’. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వదారిద్ర్యాలు తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తాయని వాలిఖిల్య మహర్షి వివరించినట్లు పురాణాలలో ఆధారాలు కూడా వున్నాయి. 

కథ : 

పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతను కటిక పేదవాడు అయినప్పటికీ గొప్ప పండితుడు. కానీ అతని భార్య అయిన చండి మాత్రం పరమ గయ్యాళి. తనకు పట్టువస్త్రాలను, ఆభరణాలను కొనివ్వలేదని.. వలితుడు చెప్పే మాటలను ధిక్కరించి.. వాటిని వ్యతిరేకంగా చేస్తుండేది. 

ఒకరోజు వలితుడు స్నేహితుడైన గణేశ వర్మ.. ఇతని బాధను తెలుసుకుని.. ‘‘నువ్వు నీ భార్యతో ఏదైనా పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా ఆమెకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పనులు చేస్తుంది’’ అని సలహా ఇస్తాడు. 

కొంతకాలం తరువాత వలితుడి తండ్రి అబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగానే వలితుడు తన భార్యతో వ్యతిరేకంగా అన్ని మాటలు చెబుతాడు. వలితుడు ‘‘రేపు మా తండ్రిగారి ఆబ్ధికం వుంది. అయినా నేను ఆబ్ధికం పెట్టుకోదలచుకోలేదు’’ అని చండీతో అంటాడు. 

భర్తమాటలు విన్న చండి.. ఆయన తండ్రిగార ఆబ్ధికం చేయిస్తుంది. ఇలాగే కొన్నాళ్లు సవ్యంగా సాగుతున్న తరుణంలో వలితుడు తన భార్య చండితో ఇలా అంటాడు.. ‘‘పిండాలను తీసుకెళ్లి నదిలో పడేసిరా’’ అంటాడు. కానీ ఆమె దానికి వ్యతిరేకంగా ఆ పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వస్తుంది. 

ఇది చూసిన వలితుడు తీవ్ర దిగ్ర్భాంతికి గురి అయి.. అప్పటికప్పుడు ఇల్లు వదిలేసి అరణ్యానికి వెళ్లిపోతాడు. అలా తను దీక్షలో మునిగిపోతాడు. 

కొన్నాళ్ల తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వస్తుంది. ఆరోజు సాయంకాలం అవ్వగానే ముగ్గురు నాగకన్యలు వలితుడు చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో వున్న నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. 

అలాగే వారు పాచికలు ఆడడానికి సిద్ధమవుతారు. కానీ వారు ముగ్గురే వున్నారు కాబట్టి నాలుగో మనిషి కోసం చుట్టుపక్కలా గాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వారికి వలితుడు కనిపిస్తాడు. 

వలితుడిని చూసి వారు ముగ్గురు తమతో పాచికలు ఆడడానికి రమ్మని కోరుకుంటారు. అయితే అది జూదం కాబట్టి వలితుడు వారితో ఆడడానికి తిరస్కరిస్తాడు. కానీ ఎంతో ఆరోజు చాలా పుణ్యమైన దినం కాబట్టి పాచికలు ఆడడం నియమమని వలితుడిని ఒప్పించి, తమతో తీసుకెళతారు. 

అదేసమయంలో లక్ష్మీసమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకుని వున్నారో చూడడానికి రాగా.. వారిద్దరికి ముగ్గురు నాగకన్యలు, వలితుడు పాచికలు ఆడుకుంటూ కనిపించారు. దాంతో వారు చాలా సంతోషించి లక్ష్మీదేవి వారికి సకల సంపదలు ప్రసాదించిందని కథనం. 

కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమినాడు లక్ష్మీదేవిని పూజించినవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలలో కూడా పేర్కొనబడి వుంది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.