మే2 న కాళేశ్వరం కు రానున్న ముఖ్యమంత్రి

0

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జిల్లాకు రానున్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి సోమవారం ఆయన శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జేసీ పౌసుమిబసు శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించి, బాధ్యతలు అప్పగించారు. కాళేశ్వరంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జోయల్ డేవిస్ ఎమ్మెల్యే పుట్టమధుతో కలిసి పరిశీలించారు.

ఈ నెల 2న మేడిగడ్డ బ్యారేజీ పనుల శంకుస్థాపన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం జేసీ పౌసుమిబసు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం మే 1న రాత్రి ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకొని కేసీఆర్ భవన్‌లో బసచేస్తారు. 2న ఉదయం కరీంనగర్ నుంచి బయలుదేరి కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద పంపుహౌస్ నిర్మాణ పనులకు, అనంతరం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జేసీ, వివిధ శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించారు. హెలీప్యాడ్ ఏర్పాటు బాధ్యతను రహదారులు,భవనాలశాఖ జిల్లా ఎస్‌ఈకి అప్పగించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రొటోకాల్ ఏర్పాట్లను, కరీంనగర్, మంథని ఆర్డీఓలకు అప్పగించారు. కాళేశ్వరం దేవాలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను అదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారిని, అవసరమైన చోట వైద్య సౌకర్యం కల్పించాలని జిల్లా వైద్యాధికారిని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి పరిశీలించారు. శుక్రవారం కాళేశ్వరం చేరుకున్న ఎస్పీ, ముఖ్యమంత్రి ఆలయ దర్శనం చేసుకునే మార్గాన్ని, బస చేయనున్న అతిథి గృహాన్ని పరిశీలించారు. ఆయా చోట్ల అన్ని సౌకర్యాలు సమకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు. కన్నెపల్లి వద్ద, కాళేశ్వరం సమీప గోదావరి నది వద్ద హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించారు.

అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన వెంట ఓఎస్డీ సుబ్బారాయుడు, గోదావరిఖని ఏఎస్పీ విష్ణు వారియర్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సతీశ్, డీఈ రాజునాయక్, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, సీఐ సదన్‌కుమార్, ఎస్.ఐ కృష్ణారెడ్డి ఉన్నారు.

మూడు బ్యారేజీలకూ ఒకేసారి : ఎమ్మెల్యే పుట్టమధు
కాళేశ్వరం: గోదావరి నదిపై తలపెట్టిన మేడిగడ్డ సహా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి శంకుస్థాపన చేస్తారని మంథని ఎమ్మెల్యే పుట్టమధు వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చిన ఆయన, సీఎం పర్యటన విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ముందుగా హెలీక్యాప్టర్‌లో కాళేశ్వరం చేరుకొని, గోదావరిలో స్నానం అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం 2012లో అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకున్నందున ముఖ్యమంత్రి ఆ మొక్కు తీర్చుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం కన్నెపల్లి వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేసి మేడిగడ్డ చేరుకుంటారని వెల్లడించారు. అక్కడ ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి పనులను కూడా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా కాళేశ్వరం గోదావరి వద్ద ఏడు అడుగులతో కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.