నర, నారాయణ సేవా పరాయణుడు

1

కఠినమైన కోతలకు గురైతేనే వజ్రం నాణ్యమైనదిగా మారి జిగేల్మంటుంది.జీవితంలో కష్టాలు రావడం సహజమే అయినా,వాటిని ఎదుర్కొని ఉన్నతంగా ఎదిగేవారు కొందరే ఉంటారు.అటువంటివారి జీవితాలు వజ్రంలా మెరుస్తూ పదిమందికి దారి చూపిస్తాయి…ఐదవ తరగతి వరకు లెక్కల్లో ఫెయిలయిన పిల్లోడే,నేడు ఖాయిలా పడేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల లెక్కలను గాడిలో పెట్టి వేలకోట్లకు ఎగబాకించాడు.చదువుకోవాలన్న తపన,తెలివి ఉన్నా పూట గడవడం కోసం ట్యూషన్లు చెప్పిన కుర్రోడే నేడు వేల మంది అన్నార్తుల క్షుద్బాధ తీరుస్తున్నాడు.ప్రేమైక జీవనంతో దేన్నైనా సాధించవచ్చు అంటూ నర, నారాయణ,పర్యావరణ హిత సేవ చేస్తూ పదిమందికి మార్గనిర్దేశనం చేస్తున్నారు గుజరాత్‌లోని బరోడాకు చెందిన గట్టు నారాయణ(గురూజీ).సరస్వతీ కటాక్షం కొరకు రోజూ ఆరు కిలోమీటర్లు నడిచానని చెప్పే గురూజీ జీవితగమనంలోని ఎత్తుపల్లాలు వారి మాటల్లోనే మన తెలంగాణ పాఠకుల కొరకు…
లక్ష్మీకాంతరావుసార్ చెంపదెబ్బ : నేను పుట్టి పెరిగింది కరీంనగర్‌జిల్లా మంథని.నాన్న రామన్న,అమ్మ సీతమ్మ,మేం ముగ్గురు అన్నదమ్ములం,ఇద్దరు చెళ్ళెండ్లు.పెద ్ద,పేద బ్రాహ్మణ కుటుంబం మాది. ఉర్లోనే మెట్రిక్యులేషన్ వరకు చదివాను. ఐదవ తరగతి వరకు లెక్కల్లో ఫెయిల్ అయ్యేవాడిని.నేను పొట్టిగా ఉండడంతో క్లాస్‌లో ముందుబెంచీలో కూర్చునేవాడిని.ఓ రోజు మా లెక్కల టీచర్ అయిన లక్ష్మీకాంతరావు సార్ బోర్డ్‌మీద లెక్కచేస్తూ నన్ను ప్రశ్న అడిగారు సమాధానం తప్పు చెప్పడంతో చెంప ఛెళ్ళుమనిపించారు.ఆ వయసులో వచ్చిన ఉక్రోషం నన్ను నాన్నదగ్గరికి వెళ్ళేలా చేసింది. నాన్ననడిగా లెక్కల్లో 100/100 మార్కులు రావాలంటే ఏం చేయాలని..?సరస్వతీ కటాక్షం ఉండాలి అన్నారు నాన్న,అదెలా వస్తుంది అడిగా మళ్ళీ,అమ్మనడుగు అన్నారు.అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగా అమ్మా నిన్నుదలంచి పుస్తకం చేబూని అంటూ సరస్వతిని వేడుకో అని అమ్మ చెప్పింది.సరస్వతి ఎక్కడ.? మళ్ళీ నా చిన్ని మెదడులో ఆలోచన.
అమ్మ ప్రేమ గొప్పది : మంథని గోదారిఒడ్డున గల సరస్వతి ఆలయానికి వెళ్లి అమ్మచెప్పిన పద్యం చదివి మొక్కుకున్నా అలా ఓ నాలుగురోజులు వెళ్ళాను ఏం మార్పులేదు.తర్వాత నా పుస్తకాలు తీసుకువెళ్ళి అక్కడ కూర్చొని అమ్మకు మొక్కి చదవడం మొదలుపెట్టాను.నాల్గో తరగతి లెక్కల్లో ఫెయిల్ అయినందుకు ఆ పుస్తకం కూడా తీసుకువెళ్ళేవాడిని అలా నాలుగు,ఐదు తరగతుల లెక్కలన్నీ ఒకటికి పదిసార్లు సాధన చేశాను,ఆ ఆలయ పరిసరాల్లో ఏదో తెలియని చైతన్యం వచ్చేది నాలో.అంతే మూణ్ణెళ్ళ పరీక్షల్లో 100/100 మార్కులు వచ్చినవి.ఓ సారి పరీక్షల్లో 100 కు మూడు మార్కులు తగ్గితే అమ్మ నాతో రెండురోజులు మాట్లాడలేదు.అమ్మ మౌనం నన్ను జీవితంలో లెక్కల్లో మార్కులు తగ్గకుండా చేసింది అంటే అమ్మ ప్రేమ గొప్పది.ఎనిమిది తొమ్మిది తరగతులకు వచ్చేసరికి నేను అందరికీ లెక్కలుచెప్పే స్థాయికి నా పరిఙ్ఞానం పెరిగింది.
అన్నయ్య ఉద్యోగం అలోచింపజేసింది : నేను పది,పదకొండు తరగతుల చదివేందుకు వరంగల్ వెళ్లాను.మధ్యలో మానేసి పెద్దన్నయ్య ఉద్యోగంచేసే నాగార్జున్ సాగర్‌కు వెళ్ళి అన్నయ్యకు వండిపెట్టేవాడిని.ఓ రోజు వండడం ఆలస్యం అవడంతో ఆకలితో వచ్చిన అన్నయ్య కోప్పడ్డారు అంతే అక్కడినుండి వచ్చేశా.అన్నయ్య డబ్బులివ్వనన్నారు ఐనా ఉక్రోషం ఏం చెయ్యాలి అనే ఆలోచన.ఇంట్లో ఉన్న అల్లనేరేడు చెట్టు పండ్లను ఓ సంచిలో నింపుకొని బయటకు వచ్చేశాను.నేరేడు పండ్లు తిని కడుపునింపుకున్నాను,హైదరాబాద్ వైపు లారీ వెళ్తుంటే ఆపి తీసుకువెళ్ళమని అడిగి నేరేడుపండ్లు పెట్టాను దాంతో అతను కాదనలేదు.ప్రయాణంలో డ్రైవర్‌కు కొన్ని కథలు చెప్పాను,అతను మెచ్చుకుంటే నేను మా ఊరికి వెళ్ళడానికి డబ్బులివ్వమని అడిగాను.రెండు రూపాయలు చేతిలో పెట్టాడు,దాంతో మంథని చేరుకొన్నాను.అన్నయ్యకు చదువు,ఉద్యోగంతో గౌరవం వచ్చింది కదా,నేనూ చదవి ఉద్యోగం చేయాలనుకున్నాను.పేపర్ చదువుతుంటే డిప్లమా కోర్సుకు సంబంధించి యాడ్ చూసి ఎంట్రెన్స్ రాశాను.లెక్కల్లో 100/100 మర్కులు వచ్చాయి.నాన్నకు అదే సమయంలో పక్షవాతం రావడంతో ఆర్థికంగా మరింత కష్టం ఏర్పడింది.అమ్మనడిగితే పది రూపాయలు చేతిలో పెట్టి చదుకొమ్మంది.
ట్యూషన్లు చెబుతూ : డిప్లమాలో సీటు దొరికింది కాని చేతులో డబ్బుల్లేవు దాంతో ప్రిన్సిపాల్‌ను కలిసి పరిస్థితి వివరించాను.గౌడ అనే వ్యక్తిని కలువమన్నారు అతను నా మర్కులు చూసి ఇంప్రెస్ అయి తన దగ్గర ఉన్న చిల్లర అంతా జమచేసి 180 రూపాయలు ఇచ్చారు,వసతి మంథని వారు కల్పించారు.,అలా ట్యూషన్లు చెబుతూ ఇంటికి కూడా డబ్బు పంపేవాడిని.డిప్లొమాలో ఫస్ట్‌ర్యాంక్‌లో పాస్ అయ్యాను.డిప్లొమా కాగానే ఓవర్సీస్ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగం దొరికింది.ట్రైనింగ్ వోల్టాస్ కంపెనీలో చేశాను.
యంగెస్ట్ మేనేజర్ : వోల్టాస్ కంపెనీలో పనిచేస్తూనే A M I E ముంబయి లో చేరి చదువులో టాప్‌చేశాను.దాంతోపాటే ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్,ఆపరేషన్ మేనేజ్‌మెంట్(జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్),I I T బాంబేలో ఎలక్ట్రికల్ ఇన్ఫ్లుయేషన్ ఇంజనీరింగ్,డాటా మ్యాటిక్స్ కంప్యూటర్ ప్రోగ్రాం కోర్స్, మొదలగు ఎనిమిది క్వాలిఫికేషన్స్ పదేళ్ళల్లో పూర్తిచేశాను.వోల్టాస్ కంపెనీలో పదేళ్లలో ఎనిమిది ప్రమోషన్స్ వచ్చినవి.చదివింది ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అయినా హైడ్రాలిక్ స్టాటిక్స్‌లో నాకు మంచి పట్టు ఉన్నది.వోల్టాస్ కంపెనీలో ఛీఫ్ ఇంజనీర్‌గా చేసినప్పుడు యూరోప్ మొత్తం సందర్శించాను.తర్వాత బరోడాలో ఆగ్ఫా కెమెరా కంపెనీలో చేరాను అక్కడినుండి జర్మనీ వెళ్లివచ్చాను.
గీత మార్చిన గీత : సొంతంగా ట్రోకామ్ కంప్యూటర్ బేస్డ్ కంపెనీ స్థాపించాను.200 మందికి ఉపాధి కల్పించాను.ఆ తర్వాత ప్రీతమ్ కంప్యూటర్ సర్వీసెస్ కంపెనీ పెట్టి నష్టపోయాను.అప్పటికే ముగ్గురు పిల్లలు.దాంతో మంథనికి వచ్చి నిష్టగా 18 రోజులు భగవద్గీతా యఙ్ఞం చేశాను.అంతే గీత నా తల రాతను మార్చింది.అప్పటి నుండి ఇప్పటివరకు నేను తిరిగి చూసుకోలేదు.
రెండు కోట్ల నష్టాన్ని 11 వందల కోట్ల లాభాలకు తీసుకువచ్చాను : ఎక్సెల్ ఇండస్ట్రీస్ 40 కోట్ల టర్నోవర్‌తో నడిచేది అది రెండుకోట్ల నష్టంలో కూరుకుపోయింది.అదే సమయంలో నేను టేకప్ చేసి 11 వందల కోట్ల లాభాల్లోకి తీసుకువెళ్లాను.లావోపాల కంపెనీ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే అదికూడా ఇప్పడు లాభాల్లో నడుస్తుంది.అలా దాదాపు 20 కంపెనీలకు కన్సల్టెన్సీ చేశాను.అన్ని అభివృద్ధి సాధించాయి.ఈ కంపెనీల్లో దాదాపు రెండువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.
ప్రస్తుత పదవులు : ఎక్సెల్ ఇండస్ట్రీస్,యష్ పేపర్స్ లిమిటెడ్,పంజాబ్ కెమికల్స్&ఫార్మాస్యూటికల్స్ టిమిటెడ్ వంటివాటికి గౌరవ సూచక ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నాను.ఆర్యన్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా,మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు గైడ్‌గా వ్యవహరిస్తున్నాను.ఈ కంపెనీలకు అందిస్తున్న సేవలకు వారు తిరిగి నా సేవాకార్యక్రమాలకు అయ్యే ఖర్చు భరించడం తప్ప నేను వారినుండి ఏం ఆశించడం లేదు.
సీతారామ సేవాసదన్ : మంథనిలో సీతారామ సేవాసదన్ స్థాపించాను దాని ద్వారా ప్రతిరోజు అన్నదానం.ఉషాజ్యోతి మహిళా వికాస కేంద్రం లో మహిళలకు కుట్టు మరియు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం.ముద్దు రామక్రిష్ణయ్య యువజన వికాస కేంద్రం ఏర్పాటుచేసి యువతకు లైబ్రరీ మరియు ఆటస్థలం ఏర్పాటుచేయడం జరిగింది.గౌతమి కంప్యూటర్ శిక్షణ లో భాగంగా యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నాము.పిల్లల ఆటల కొసం శ్రీపాద బాల ఉద్యానవనం.మంథని పురాతన వస్తువులను ప్రదర్శించే మంత్రపురి దర్శన్.ముద్దు విశ్వనాథం ముక్తిధామ్ లో శవదహనానికి కావల్సిన కట్టెలను 1000 రూపాయలకే అందించడం.మాదాడి మాణిక్యమ్మ,రాఘవరెడ్డి ఉద్యానవనస్థలి ఏర్పాటుచేసి పండ్ల మరియు ఔషధ తోటల పెంపకం.గౌతమి ధ్యాన కేంద్రం.జలధార కింద ఉచిత నీటి పంపిణీ,కరువు ఏర్పడినప్పుడు పశువులకు దాణా అందించడం,శవాలను బధ్రపరిచేందుకు ఫ్రీజర్,అంబులెన్స్,వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలకు ఆర్థికసాయం చేయడమే కాకుండా గవర్నమెంట్ పాఠశాలల్లో టాయిలెట్ నిర్మాణాలు,గదుల నిర్మాణాలు.సరస్వతీ శిశుమందిర్‌లో నూతన పాఠశాల భవనం మరియు వైఙ్ఞానికి ప్రదర్శనలు ఏర్పాటుచేసేందుకు ఆర్థిక సాయం.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ మరియు స్కాలర్‌షిప్స్ అందజేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాను.ఇప్పటి వరకు 600 పుస్తకాలను కాపీరైట్ లేకుండా వ్రాసి ప్రచురించాను.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

1 Comment

  1. PEDDIRAJU PURUSHOTHAM RAO on

    Good to read about you sir….Thanks to manamanthani .com for posting about such great personality …

    Regards
    Peddiraju Purushotham Rao