సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

0

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 8గంటలకు కరీంనగర్ తీగలగుట్ట పరిధిలోని కేసీఆర్‌భవన్ చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.

2న కార్యక్రమాలు
2న ఉదయం 6గంటలకు కేసీఆర్ నివాసం నుంచి బయలు దేరి కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్ చేరుకుంటారు. 6.10గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా 6.35 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానానికి వెళ్తారు. పూజా కార్యక్రమాల అనంతరం 7.15 గంటలకు రోడ్డుమార్గం ద్వారా కన్నెపల్లి వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 8 గంటలకు కాళేశ్వరం దేవస్థానానికి వచ్చి అల్పాహారం తీసుకుంటారు. 9.30గంటలకు కాళేశ్వరం నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు అంబట్‌పల్లి చేరుకుంటారు.

అంబట్‌పల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 9.50గంటలకు మేడిగడ్డ బ్యారేజీ స్థలానికి చేరుకుంటారు. అక్కడ భూమిపూజ చేసిన తదుపరి బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 10.30గంటలకు అక్కడి నుంచి బయలు దేరి హెలీక్యాప్టర్‌లో నేరుగా 11.40గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.

భగీరథ యత్నం: ఎంపీ బాల్కసుమన్
అలుపెరగని పోరాటం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్, అదే స్పూర్తితో హరిత తెలంగాణగా మార్చేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ బాల్కసుమన్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం హెలీప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత చరిత్రలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు కనిపించరని పేర్కొన్నారు.

తెలంగాణ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా నిరంతరం శ్రమించి, దిగువన ఉన్న నీటిని ఎగువకు మళ్లించాలనే యోచన చేయడమే కాక, దానిని అచరణలోపెట్టి చూపించేందుకు వస్తున్న ముఖమంత్రికి యావత్ తెలంగాణ ప్రజలు రుణ పడి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదో చారిత్మక నిర్ణయమన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా యావత్ ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఈ స్వప్న సాధనలో తాము భాగస్వాములం కావడం సంతోషకరంగా ఉందన్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న, జరిగిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులకు పలు రకాల బా ధ్యతలు అప్పగించారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు
కరీంనగర్ క్రైం : జిల్లాలో ముఖ్యమం త్రి పర్యటనకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. హెలిప్యాడ్ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారి వివరాలు సేకరించి భద్రతాపరమైన సూచనలు జారీ చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి న ఎస్పీ, పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.