Manthani People Celebrating Bathukamma Fest Very Grandly

0

రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటనూ విని, చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం కష్టమే.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే.అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా తెలంగాణ బతుకమ్మ పండుగతో సరిపోలవు.

చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమిక ను పోషిస్తాయి.

ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం)లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలం లో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది, మధ్యలో తంగేడి పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్ఠమైంది. ఉద్యమ సందర్బాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.