మంథని ని జిల్లా చేయాలని ప్రభుత్వానికి ఈ మెయిల్‌

0

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో మంథని కేంద్రంగా పీవీ జిల్లాను ప్రకటించాలని డీసీసీ అధికార ప్రతినిధి శశిభూషన్‌కాచే కోరారు. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంథని కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జిల్లా ఏర్పాటుతో పాటు ఎంతో చారిత్రక మంథని నియోజకవర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాలో కలపడంపై అభ్యంతరం, ఆక్షేపణలు చేస్తూ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్‌కు ఈ మెయిల్‌ ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు. మంథని పురాతణమైన పట్టణమని, వేద వేదాంగపరులు, పరిపాలనాధ్యక్షుడు, స్వాతంత్ర్యపోరాటయోధులు, పారిశ్రామికవేత్తలు, విజ్ఞులతో వెలసిల్లినదన్నారు. 30సంవత్సరాల క్రితం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాడిన అనంతరం అనేక విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. 1946లోనే ఇక్కడ ఉన్నత పాఠశాల ఏర్పాటు జరిగిందని, నాడు జిల్లాలో మూడు ఉన్నత పాఠశాలలుండగా అందులో జగిత్యాల, కరీంనగర్‌, మంథనిలో ఉండేవన్నారు. రెండు ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పాటు అయ్యాయని, మంథనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎన్నోమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ విధానాల కారణంగా ఆచరణకు నోచుకోలేదన్నారు. మంథని నియోజకవర్గంలో ఒకవైపు గోదావరి, మానేరు ఉండగా మరోవైపు బొగ్గు నిక్షేపాలు, అపార సంపద ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు సైతం మంథని నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు. బౌగోళికంగా, సహజ వనరులు, విస్తీర్ణంతో పాటు ఇతర అభివృద్దికి దోహదపడే వనరులు ఉన్న మంథనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎంతో చరిత్ర కల్గిన మంథని అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాల్లో విలీనం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి మంథని కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

You are able to post comments by logging in through facebook.

comments

Share.

Comments are closed.